సర్పంచులను వెంటాడుతున్న అప్పుల బాధలు
అధికార పార్టీ నిర్లక్ష్యానికి బలవుతున్న సర్పంచులు
చేసిన అభివృద్ధి పనులకు నిధులు రాక అప్పుల పాలు
ఇప్పటికే అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డ సర్పంచులు
తాజాగా అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు..
ఇంటి నుంచి వెళ్లిపోయిన గ్రామ సర్పంచ్ భర్త
మెదక్ జిల్లాలో అధికార పార్టీ సర్పంచ్ భర్త అదృశ్యం
ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచ్ పంబాల జ్యోతి భర్త శ్రీనివాస్ మిస్సింగ్
రూ.40లక్షల అప్పుల్లో కూరుకుపోయామని..
ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని తన అన్నతో చెప్పిన శ్రీనివాస్
గ్రామ పంచాయతీ పాలకవర్గం-ఉప సర్పంచ్ కూడా ..
బిల్లుల విషయంలో సహకరించడం లేదని వాపోయిన శ్రీనివాస్
అప్పులు భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోతున్నానన్న శ్రీనివాస్
శ్రీనివాస్ ఫోన్ డాటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఇకనైనా ప్రభుత్వం స్పందించేనా..? బిల్లులు మంజూరు చేసేనా?
సర్పంచుల బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదా?
అగమ్యగోచరంగా అధికార పార్టీ సర్పంచుల బాధ
మరి ప్రతిపక్ష పార్టీ సర్పంచుల పరిస్థితి ఏంటి?
మెదక్ జిల్లా రామయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో అధికార పార్టీ సర్పంచ్ భర్త అదృశ్యం కలకలం రేపింది. చేసిన అభివృద్ధి పనులకు నిధులు రాక సర్పంచుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొందరు ఆత్మహత్యలు చేసుకోగా.. మరికొందరు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికార బీఆర్ఎస్ కు తమ గోడు పట్టడం లేదని, బిల్లులు అందక అప్పుల ఊబిలో కూరుకుపోయామని వాపోతున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ సర్పంచ్ భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోవడం హాట్ టాపిక్ మారింది.
ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచ్ పంబాల జ్యోతి భర్త శ్రీనివాస్ నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు.గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు సకాలంలో రాకపోవడంతో .. 40 లక్షల అప్పుల ఊబిలో కూరుకుపోయామని, అందుకే ఇంట్లో నుంచి వెళ్లి పోతున్నామని తన అన్న లింబాద్రికి ఫోన్ చేసి చెప్పారు శ్రీనివాస్.గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఉప సర్పంచ్ కూడా బిల్లుల విషయంలో సహకరించడం లేదని తన బాధను వెల్లబోసుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ పంబాల జ్యోతి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.శ్రీనివాస్ ఫోన్ డాటా ఆధారంగా,సీసీ కెమెరాల నిఘాను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
అధికార బీఆర్ఎస్ పార్టీ సర్పంచుల పరిస్థితి ఇలా ఉంటే, ప్రతిపక్ష పార్టీల సర్పంచుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి గ్రామంలో ఇదే సమస్యలు నెలకొన్నాయని సర్పంచ్ లు అంటున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్పందించి.. గ్రామపంచాయతీల అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మెదక్ నియోజక వర్గం లోని సర్పంచ్ లు విజ్ఞప్తి చేస్తున్నారు.









