AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

RGV దగ్గర ‘పిచ్చోళ్లే’ ఎందుకు పనిచేస్తారు?.. జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు

రామ్ గోపాల్ వర్మతో కలిసి పనిచేసిన అనుభవాలను నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆర్జీవీ దగ్గర పనిచేసే వారిలో ప్రత్యేకమైన ఆలోచనా విధానం ఉంటుందని, అదే వారిని ఇతరుల నుంచి భిన్నంగా నిలబెడుతుందని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్ వంటి దర్శకుల్లో తెలియకుండానే ఒక ప్రత్యేకమైన ఫిలాసఫీ కనిపిస్తుందని, వారితో మాట్లాడినప్పుడు ఆ ఆలోచనా విధానం అర్థమవుతుందని జేడీ తెలిపారు. గతంలో వర్మను సరదాగా ‘‘పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక పిచ్చోళ్లందరూ మీ దగ్గరకే వస్తారా?’’ అని అడిగానని, దానికి వర్మ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

వర్మ దగ్గర పనిచేసే వారిలో జెన్యూనిటీ, బోల్డ్‌నెస్ ఉంటాయని జేడీ అభిప్రాయపడ్డారు. పది మంది ఆయన దగ్గరకు వచ్చినా చివరికి కొంతమందే ఫిల్టర్ అయి మిగులుతారని, ఆ వ్యక్తులందరిలో ఒకే రకమైన ఆలోచనా విధానం ఉంటుందని చెప్పారు. తాను కూడా ‘శివ’ సినిమా సమయంలో రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. అయితే మొదట అసిస్టెంట్ డైరెక్టర్ పని అంటే హీరోయిన్లతో మాట్లాడటం వంటి పనులు ఉంటాయని అనుకున్నానని, కానీ అక్కడే సినిమా కోసం పడే కష్టం, అసలు పని ఏంటో అర్థమైందని నవ్వుతూ తెలిపారు.

ప్రత్యేకమైన ఆలోచనా విధానం ఉన్నవాళ్లే ఏ రంగంలోనైనా ఎక్కువ కాలం నిలబడతారని జేడీ అన్నారు. ‘సత్య’ సినిమాను మళ్లీ చూసినప్పుడు అందులో చిన్న పాత్రలు చేసిన పలువురు నటులు తర్వాత పెద్ద స్థాయికి ఎదిగారని చెప్పారు. ‘దుబాయ్ శీను’లో విలన్‌గా నటించిన వ్యక్తి కూడా ‘సత్య’లో చిన్న పాత్రలో కనిపించారని, ఆయన ఆ పాత్రకు సరిపోతారని తానే సూచించానని జేడీ వెల్లడించారు. ఆర్జీవీ సినిమాల ద్వారా వెలుగులోకి వచ్చిన పలువురు ప్రతిభావంతుల గురించి జేడీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ANN TOP 10