AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

AP Cabinet Meeting: అమరావతిపై కీలక నిర్ణయాలు.. రేపు ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం గురువారం ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో అమరావతి అభివృద్ధి, సీఆర్డీఏ ప్రతిపాదనలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణం కోసం మొతడక గ్రామంలో 2,340 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకునే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

పల్నాడు జిల్లాలోని 244.39 ఎకరాల ఇనాం భూములను దేవాదాయ శాఖ నుంచి సీఆర్డీఏకు బదిలీ చేసేందుకు రూ.122 కోట్ల చెల్లింపునకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే ‘హ్యాపీ నెస్ట్’ గృహ నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ రేరాకు చెల్లించాల్సిన రెన్యువల్ ఫీజు రద్దు ప్రతిపాదనపై కూడా చర్చించనున్నారు. అమరావతిలో 9 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల నిర్మాణం, నగరంలోని 20 ప్రాంతాల్లో 5జీ సెల్ టవర్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచే అంశానికి కూడా ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక పీపీపీ విధానంలో రోప్‌వే ప్రాజెక్టు అమలుకు కన్సల్టెన్సీ నియామకానికి అనుమతి ఇవ్వడంతో పాటు, క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా రూ.1,205 కోట్లతో 18 అంతస్తుల రెండు టవర్ల నిర్మాణ పనులను ఎల్‌అండ్‌టీకి అప్పగించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తంగా రేపటి కేబినెట్ భేటీలో అమరావతి అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో సమావేశంపై ఆసక్తి నెలకొంది.

ANN TOP 10