పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నిబంధనలను ఉల్లంఘించి అనధికారిక లీగ్‌లో పాల్గొన్న పలువురు మాజీ క్రికెటర్లపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అన్‌అప్రూవ్డ్ లీగ్‌లో ఆడినందుకు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఇర్ఫాన్‌తో పాటు పలువురు మాజీ ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జాంబియాలోని లుసాకాలో ఇటీవల నిర్వహించిన ‘ఏషియన్ లెజెండ్స్ లీగ్’ (ALL)కు ఐసీసీతో పాటు జాంబియా క్రికెట్ యూనియన్ (ZCU) గుర్తింపు లేదా మద్దతు లేదని సమాచారం.
PCB నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకోకుండానే ఈ లీగ్‌లో పాల్గొన్న ఆటగాళ్లపై బోర్డు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం అనుమతి లేని టోర్నీల్లో పాల్గొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న PCB.. సంబంధిత ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే నిషేధంపై తుది నిర్ణయం అధికారికంగా వెలువడాల్సి ఉంది.
రెండేళ్ల నిషేధం అమల్లోకి వస్తే సంబంధిత ఆటగాళ్లు క్రికెట్‌కు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనలేరు. కేవలం ఆటగాళ్లుగానే కాకుండా PCB లేదా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) పరిధిలోని జట్లకు కోచ్, మెంటార్, సలహాదారు వంటి పాత్రల్లోనూ పనిచేయడానికి అవకాశం ఉండదు. ఐసీసీ నిబంధనలను పాటించడం, క్రికెట్‌లో సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు PCB వర్గాలు పేర్కొన్నాయి.








