AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

22ఏ భూములపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు.. అర్హులైన పేదలకు అన్యాయం జరగొద్దని సూచన

హైదరాబాద్‌: తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా కారణంగా ఏ ఒక్క అర్హులైన పేదవాడికి, నిజమైన భూహక్కుదారుడికి అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక్క సెంటు ప్రైవేట్‌ భూమిని కూడా 22ఏ జాబితాలో చేర్చలేదని, ప్రైవేట్‌ భూములను నిషేధించారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో 22ఏ భూములు, ప్రజావాణి ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలపై ఉన్నతాధికారులు, పలు జిల్లాల కలెక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

అర్హులైన భూహక్కుదారుల ప్రయోజనాలను కాపాడుతూనే ప్రభుత్వ భూములను రక్షించడం అనే రెండు లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. 22ఏ భూములకు సంబంధించిన హైకోర్టు నిర్దేశించిన 45 రోజుల గడువులోనే దరఖాస్తులు, ఫిర్యాదులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన 22ఏ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే విచారణ పూర్తి చేసి పరిష్కరించాలని సూచించారు. ప్రతి కేసును తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టర్‌ స్థాయిలో సంబంధిత రికార్డులు, చట్టపరమైన ఆధారాల ఆధారంగా సమగ్రంగా పరిశీలించాలని స్పష్టం చేశారు.

22ఏ భూములకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకే ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ భూములపై అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలు జరగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పారదర్శకంగా వ్యవహరిస్తూ ప్రజల హక్కులు, ప్రభుత్వ ప్రయోజనాల మధ్య సమతుల్యత పాటించాలని అధికారులకు సూచించారు.

ANN TOP 10