AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

Srisailam Water Release: శ్రీశైలం నుంచి నీటి విడుదల.. తాగునీటి భద్రతకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెబుతూ శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2027 జూన్ వరకు సూపర్ ఎల్‌నినో ప్రభావం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీశైలం నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాల కోసం భద్రపరచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం జలాశయంలో 119 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, రాబోయే పది రోజుల్లో మరో 100 టీఎంసీల వరకు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు.

కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 63 శాతం వాటాను ముందుగా తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాయలసీమ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం నుంచి నీటి విడుదల చేపడుతున్నట్లు తెలిపారు. హంద్రీ-నీవా పరిధిలోని రిజర్వాయర్లకు 13 టీఎంసీల నీరు అవసరమని, పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు తాగునీటి కోసం రేపటి నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే తెలుగు గంగ పథకం ద్వారా చెన్నై తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీలు, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలోని తాగునీటి అవసరాల కోసం మరో 32 టీఎంసీల నీరు అవసరమని వివరించారు.

వర్షాలు, వరదల పరిస్థితులను ప్రతి వారం సమీక్షిస్తూ ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేలా కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ANN TOP 10