హైదరాబాద్: తెలంగాణలో అత్యవసర సేవల వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న ‘డయల్ 100’ స్థానంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని అత్యవసర సేవలకు ఒకే నంబర్‌గా ‘112’ అందుబాటులోకి వచ్చింది. “వన్ నేషన్.. వన్ ఎమర్జెన్సీ నంబర్” లక్ష్యంతో రూపొందించిన ఈ ఏకీకృత అత్యవసర స్పందన వ్యవస్థను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అధికారికంగా ప్రారంభించారు. పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, మహిళల రక్షణ వంటి అత్యవసర సేవలను 112 ద్వారా ఒకే వ్యవస్థ కిందకు తీసుకొచ్చారు.
రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దోపిడీలు, వేధింపులు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేస్తే సంబంధిత సహాయం వేగంగా అందేలా వ్యవస్థను రూపొందించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అత్యాధునిక కాల్ మానిటరింగ్ సిస్టమ్‌తో అనుసంధానించారు. 112కు కాల్ వచ్చిన వెంటనే బాధితుడి లొకేషన్‌ను గుర్తించి, సమీపంలోని పెట్రోలింగ్ లేదా అత్యవసర బృందాలకు సమాచారం చేరవేస్తారు. అవసరాన్ని బట్టి ఇతర అత్యవసర విభాగాలను కూడా వెంటనే రంగంలోకి దించేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దారు.
ఈ కొత్త విధానంతో అత్యవసర సమయంలో ప్రజలు వివిధ సేవలకు వేర్వేరు నంబర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఏ రకమైన ఆపద ఎదురైనా ఒకే నంబర్ 112కు కాల్ చేయడం ద్వారా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సేవలు, ఇతర సంబంధిత అత్యవసర విభాగాల సహాయం పొందవచ్చు. దీనివల్ల కీలకమైన సమయం ఆదా కావడంతో పాటు ప్రాణాలు, ఆస్తులను కాపాడటంలో ప్రయోజనం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. 112 సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సోషల్ మీడియా, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టనుంది.








