బలగం సినిమాతో తన కళ ద్వారా తెలుగు ప్రజల హృదయాలను కదిలించిన మొగిలయ్యకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగ జంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు.. బలగం సినిమాలో కుటుంబ సభ్యుల అనుబంధాలపై పాట పాడి మనసులు గెలుచుకున్నారు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురైన మొగిలయ్యకు ప్రభుత్వం ఉచిత వైద్యమందించింది. తాజాగా వారి ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని.. దళిత బంధు మంజూరు చేస్తూ భరోసానిచ్చింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వారిని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు మొగిలయ్య దంపతులు.ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో మాట్లాడిన ఎమ్మేల్యే .. వెంటనే వారికి దళిత బంధు పథకాన్ని మంజూరు చేయించారు. కాగా మొగిలయ్యకు మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే కృషి చేశారు. మొగిలయ్య దంపతులకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చికిత్స చేయించడంతో పాటు దళిత బంధును కూడా మంజూరు చేయించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి బలగం మొగిలయ్య దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.









