వర్క్స్ బుక్స్, నోటు పుస్తకాలను ఉచితంగా అందజేయాలని నిర్ణయం
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వర్క్స్ బుక్స్, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు నోటు పుస్తకాలను ఉచితంగా అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ఇది తెలంగాణలో విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి వెల్లడించారు. వర్క్ బుక్స్‌ను, నోటు పుస్తకాలను పాఠశాల ప్రారంభమయ్యే నాటికి అందజేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి సబితా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులందరికీ బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలను పాఠశాల పునః ప్రారంభమయ్యే నాటికి అందజేయాలన్నారు. గత సంవత్సరం పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం రూ.132 కోట్లు ఖర్చు చేయగా రానున్న విద్యా సంవత్సరానికి రూ.200 కోట్లు వెచ్చించి ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫామ్‌లను పాఠశాల పునః ప్రారంభం నాటికి అందే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జూన్ 12వ నుంచి పాఠశాల పునః ప్రారంభమవుతున్నందున బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో స్థానిక శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులను భాగ్యస్వామ్యం చేయాలని సూచించారు. స్థానిక శాసన సభ్యులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ, పాఠ్య పుస్తకాల పంపిణీ, యూనిఫామ్‌లను విద్యార్థులకు అందజేసే విధంగా కార్యక్రమాల్ని రూపొందించాలన్నారు.









