సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని.. తెలంగాణ వచ్చాక దేవాలయాలు ధూప,దీప నైవేద్యాలకు నోచుకుంటున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో శివాలయం పునరుద్ధరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సింగరాజుపల్లి శివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో కూడా అనేక దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
పూర్వం రాజులు దేవాలయాలను కట్టించారని, అదే తరహాలో సీఎం కేసీఆర్ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని ఎర్రబెల్లి కొనియాడారు. గ్రామాలకు మంచి చేసే దేవాలయాలు, పాఠశాలలు, వైద్యశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.పాపాలు చేసిన వారు తొందరగా పైకి వస్తారని.. ధర్మబద్ధంగా పుణ్యాలు చేసే వారు తాత్కాలికంగా ఇబ్బందులు పడినప్పటికీ చివరకు ధర్మమే గెలుస్తుందని, మంచివాళ్ళకు మంచే జరుగుతుందని చెప్పారు.అనంతరం గ్రామంలోని పాఠశాల, వైద్యశాలలను పరిశీలించారు. అక్కడే స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్న పిల్లలతో సరదాగా గోలీలాడి చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు.









