సీఎం కేసీఆర్ కు రైతుల ఉసురు తగులుతుందన్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.పాలేరు నియోజకవర్గంలో వర్షానికి దెబ్బతిన్న పంటలను ఆమె పరిశీలించారు.తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో వర్షానికి దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ లో రైతులకు భరోసా లేదన్నారు.నెల రోజులుగా రైతులు ధాన్యంతో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా.. పట్టించుకోవడం లేదని విమర్శించారు.తరుగు పేరుతో పెద్ద దోపిడీ జరుగుతుందని.. క్వింటాకు 10 కిలోల తాలు తీస్తున్నారని తెలిపారు.రోడ్ల మీద ఎక్కడ చూసినా ధాన్యం కనిపిస్తుందని.. పండించడం వరకే రైతు బాధ్యత అని, పండించిన ధాన్యాన్ని కొనాల్సింది సర్కారే అని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో రైతుకి విలువ లేదని.. రైతుబంధు రూ.5 వేలు ఇచ్చి పరిహారం ఇవ్వక పోతే ఎలా అని ఆమె ప్రశ్నించారు.ఖమ్మం జిల్లాలో 230 కేంద్రాలు తెరిచామని చెప్పారని.. కానీ కేవలం 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారన్నారు. తడిసిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.









