నగరంలో చేనేత మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి కెటిఆర్ అధికారులకు ఆదేశించారు. శాఖ కు సంబంధించి బిఆర్‌కె భవన్‌లో సమీక్ష నిర్వహించిన మంత్రి కెటిఆర్ వివిధ కార్యక్రమాలు, వాటి అమలు తీరు పై చర్చించారు. నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా ప్రభు త్వం పనిచేస్తోందన్న కెటిఆర్ వారికి అత్యంత సులువుగా ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పథకాలు మరింత సులభంగా అందేలా నేతన్నల సూచనల మేరకు అవసరమైన మార్పులు చే యాలని అధికారులకు సూచించారు. టెక్స్ టైల్ పార్కు లు, మినీ టెక్స్ టైల్ పార్కులు, అప్పారెల్ పార్కుల్లో మిగిలిపోయిన పనులు ఏవైనా ఉంటే వెంటనే వాటిని పూర్తి చే సేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
బ్లాక్ లెవల్ క్లస్టర్ల పనితీరు, వాటి పురోగతిపై నివేదిక వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చేనేత రంగంలోని నేతన్నల కళ, వృత్తికి మరింత ఆదాయం వ చ్చేలా తీసుకోవాల్సిన కార్యక్రమాలపై అధ్యయనం చే యాలని అధికారులను కోరారు. చేనేత కార్మికులు అధికంగా ఉన్న నారాయణపేట, గద్వాల్, దుబ్బాక, కొడకండ్ల, మహాదేవపూర్, కొత్తకోట వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన పనులపై క్షేత్రస్థాయిలో మరింత అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశా రు.









