ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన పరువు హత్య ఘటన సంచలనం సృష్టించింది. దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన 18 ఏళ్ల కూతురిని హత్య చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి కాకుండానే గర్భవతి కావడంతో, మందులు ఇప్పిస్తాననే నెపంతో ఆమెను ఆగ్రాలోని బసౌని ప్రాంతానికి తీసుకెళ్లి చంబల్ నదిలో ముంచి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కూతురు కనిపించడం లేదంటూ తండ్రి లఖ్‌పత్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడినట్లు తెలుస్తోంది.
దర్యాప్తులో భాగంగా జూలై 29న బాలికను ఆగ్రాకు తీసుకెళ్లినట్లు, అక్కడే హత్య చేసినట్లు తండ్రి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబానికి పరువు సమస్యగా మారిందనే కారణంతో అల్లుడితో కలిసి ఈ కుట్ర పన్నినట్లు వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం బాలిక మృతదేహం కోసం పోలీసులు చంబల్ నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.








