ఎస్.ఎస్. రాజమౌళి–సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ షూటింగ్‌కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల వీడియోలు సోషల్ మీడియాలో లీక్ కావడం కలకలం రేపుతోంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లీకుల సమస్య కొనసాగుతోంది.
తాజాగా బయటకు వచ్చిన వీడియో క్లిప్పింగ్స్‌లో మహేష్ బాబుకు సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాణ్యత తక్కువగా ఉన్నప్పటికీ, అధికారిక ప్రమోషన్స్ ప్రారంభానికి ముందే ఈ దృశ్యాలు బయటకు రావడంతో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి వీడియోలను తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే అవి అభిమానుల మధ్య వైరల్‌గా మారాయి.
‘వారణాసి’ సెట్స్‌లో అత్యంత కఠినమైన భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు. సెట్‌లోకి ప్రవేశించాలంటే ఐడీ కార్డు తప్పనిసరి కాగా, నటీనటులు, సాంకేతిక సిబ్బందికి కూడా మొబైల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. అలాగే చిత్రబృందంతో నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్లు కూడా చేయించారు. అయినప్పటికీ వరుస లీకులు రాజమౌళి టీమ్‌కు పెద్ద సవాలుగా మారాయి. ఐమాక్స్ ఫార్మాట్‌లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.








