టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తొవ్వే కొద్దీ మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన తండ్రీకొడుకులు మైబయ్య, జనార్థన్‌లను మొదటిరోజు సిట్ కస్టడీకి తీసుకుంది. ఈ సందర్భంగా.. పలు కీలకాంశాలపై విచారించింది. కొడుకు జనార్ధన్ కోసం మైబయ్య ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. డాక్యానాయక్ నుంచి మైబయ్య ఏఈ పేపర్ కొనుగోలు చేశారని మొదటి రోజు కస్టడీలో తేల్చింది సిట్. మహబూబ్‌నగర్‌కు చెందిన మైబయ్య, ఆయన కుమారుడు జనార్థన్‌ను కొద్దిరోజుల క్రితం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేసే మైబయ్యకు డాక్యానాయక్‌తో పరిచయం ఏర్పడింది.
ఏఈ పరీక్ష పేపర్ లీక్ అయిందని, 6 లక్షలకు ఇస్తానని డాక్యానాయక్, మైబయ్యకు ఆఫర్ ఇచ్చాడు. అయితే.. 2 లక్షల బేరంతో డాక్యాకు ట్రాన్స్‌ఫర్ చేసి పేపర్ తీసుకున్నాడు. డాక్యానాయక్ నుంచి ఏఈ పేపర్ తీసుకుని కొడుకు జనార్థన్‌కి ఇచ్చాడు. పేపర్ లీక్ కేసులో డాక్యానాయక్ ఫోన్ కాల్స్ డేటా, అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలించగా తండ్రీకొడుకుల యవ్వారం బట్టబయలైంది. డాక్యానాయక్ అకౌంట్‌కి మైబయ్య ట్రాన్స్‌ఫర్ చేసిన 2 లక్షలకు లెక్క తేలలేదు. దాంతో.. డాక్యానాయక్‌ని లోతుగా ప్రశ్నించగా.. మైబయ్యకు ఏఈ పరీక్ష పేపర్ అమ్మినట్టు ఒప్పుకున్నాడు. ఎట్టకేలకు తండ్రికొడుకులైన మైబయ్య, జనార్దన్‌ను సిట్ అరెస్ట్ చేసింది. దానిలో భాగంగానే.. మైబయ్య, జనార్ధన్‌ల మొదటిరోజు కస్టడీలోకి తీసుకుని విచారించింది సిట్.









