మానవ సాంకేతిక అభివృద్ధి ఎంతటి శక్తిని అందించగలదో, అదే శక్తి ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ప్రపంచానికి చూపించిన భయానక ఘటన 1945 ఆగస్టు 6న జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో అమెరికా వైమానిక దళానికి చెందిన బీ-29 బాంబర్ ‘ఎనోలాగే’ జపాన్‌లోని హిరోషిమా నగరంపై ‘లిటిల్ బాయ్’ అనే అణుబాంబును వదిలింది.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.15 గంటలకు జరిగిన ఈ అణుదాడి క్షణాల్లోనే హిరోషిమా నగరాన్ని విధ్వంసానికి గురిచేసింది. భారీ ప్రాణనష్టం సంభవించడంతో పాటు, అణుధాటికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రభావాల నుంచి నగరం కోలుకోవడానికి దశాబ్దాలు పట్టాయి. ఈ ఘటన యుద్ధం ఎంతటి భయానక పరిణామాలకు దారితీస్తుందో ప్రపంచానికి తెలియజేసింది.
ఈ చారిత్రక ఘటనను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది ఆగస్టు 6న హిరోషిమా దినోత్సవం (యాంటి న్యూక్లియర్ డే) నిర్వహిస్తున్నారు. అణ్వాయుధాల నిర్మూలన, ప్రపంచ శాంతి, యుద్ధ రహిత సమాజం కోసం శాంతి ఉద్యమకారులు ఈ రోజున తమ గొంతును వినిపిస్తారు. మానవాళికి మరోసారి ఇలాంటి విషాదం జరగకుండా చూడాలనే సందేశాన్ని హిరోషిమా దినోత్సవం అందిస్తుంది.








