AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అందువల్లే చిన్నారి ప్రాణం పోయింది… కిషన్‌రెడ్డి ఫైర్

హైదరాబాద్: మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మౌనిక మృతిచెందిన ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. శనివారం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ… చిన్నారి మౌనిక మృతి చెందడం బాధాకరమన్నారు. రోడ్డును తవ్వేసి.. డ్రైనేజి పైప్‌లైన్ వేయాల్సి వస్తుంది కాబట్టి పనులు ఆపారని… ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం వల్ల ప్రాణం పోయిందని విమర్శించారు. కాంట్రాక్టర్లు పరిహారం ఇచ్చి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోవడం వల్లే పనులు ఆగుతున్నాయన్నారు.

వేల రూపాయలు ఇస్తున్నామని, హైవేలు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం.. స్థానికంగా వీటిపై దృష్టి సారించడం లేదని వ్యాఖ్యలు చేశారు. వాటర్ పైప్ లైన్ కోసం తవ్వి విడిచిపెడుతున్నారని.. బస్తీలల్లో బాధలను ఎవ్వరు పట్టించుకోవడంలేదని కేంద్రమంత్రి తెలిపారు.

చిన్నారి మౌనిక కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీదే అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కోటికిపైగా జనాభా ఉన్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ, మెట్రో వాటర్ బోర్డుల్లో నిధుల కొరత వేధిస్తోందని, అసలు నిధులు ఎటు పోతున్నాయని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. బీజేపీ తరుపున కూడా బాధితులకు అండగా ఉంటామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ANN TOP 10