వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మంచిర్యాల జోన్‌లోని బెల్లంపల్లి సబ్ డివిజనల్ పోలీస్ (ఏసీపీ) కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ పుష్పగుచ్ఛం అందించి సీపీకి స్వాగతం పలకగా, సాయుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణను పరిశీలించి, ఏసీపీ కార్యాలయానికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డివిజన్ పరిధిలో దర్యాప్తులో ఉన్న కేసులు, వాటి పురోగతి, నిందితుల అరెస్టులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల పరిస్థితి, పెండింగ్ కేసుల వివరాలపై సమీక్ష నిర్వహించారు.
పెండింగ్ కేసుల ఆలస్యానికి గల కారణాలను ఏసీపీని అడిగి తెలుసుకున్న సీపీ, కేసుల దర్యాప్తును నాణ్యతతో పూర్తి చేసి బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసుల పరిష్కారంలో వేగం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.








