ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగ అభివృద్ధి, నేత కార్మికుల సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘నేతన్న సేవలో’ పేరుతో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా చీరాలలో ఈ పథకం ప్రారంభం కానుంది.
ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు మొత్తం రూ.179 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినా చేనేత కుటుంబాల సంక్షేమం, సంప్రదాయ వృత్తి పరిరక్షణ లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేత కార్మికులకు ఈ సాయం కొంత ఊరటనిస్తుందని భావిస్తున్నారు.








