తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్మించిన నూతన సెక్రటేరియట్ (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్) ఈనెల 30న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గద్వాల వాసికి అరుదైన అవకాశం దక్కింది. నూతన సెక్రటేరియట్ ముఖ్య భద్రతాధికారి (CSO)గా గద్వాలలోని వడ్లవీధికి చెందిన అదనపు కమాండెంట్ పి.వెంకట్రాములు నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (TSPSC) అదనపు డీజీపీ స్వాతి లక్రా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్‌ఐ నుంచి ఎస్పీగా..
ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్‌కు చెందిన వెంకట్రాములు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీస్ (APSP)లో ఆర్‌ఎస్సైగా ఉద్యోగంలో చేరారు. తొలుత యూసుఫ్‌గూడలోని మొదటి బెటాలియన్‌లో ఎస్‌ఐ పనిచేశారు. ఆ తర్వాత ఆర్‌ఐగా ప్రమోషన్ పొంది కాకినాడ, కర్నూల్ బెటాలియన్లలో విధులు నిర్వర్తించారు. డిచ్‌పల్లి, వరంగల్ మామునూర్ బెటాలియన్లలో అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేశారు. అదనపు కమాండెంట్‌గా (ASP) పదోన్నతి పొందిన ఆయన.. మెున్నటి వరకు ఇబ్రహీంపట్నంలోని టీఎస్‌ఎస్‌పీ మూడో బెటాలియన్‌లో విధులు నిర్వర్తించారు. పోలీసుశాఖలో భద్రతపరమైన విధులు నిర్వర్తించడంలో ప్రత్యేకత చాటుకున్నా వెంకట్రాములు.. తెలంగాణ నూతన సచివాలయానికి తొలి CSOగా కీలక బాధ్యతలు చేపట్టారు.









