వైరల్ అవుతున్న వీడియో
లక్షల రూపాయలు చెల్లించి కొత్త కారు కొనుక్కొని బంధువుల ఇంట్లో పెళ్లి వేసుకెళ్తే అక్కడ ఆ కారు మొరాయించింది. అంతే కారు యజమానికి చిర్రెత్తుకొచ్చి కారు కొనుగోలు చేసిన సర్వీస్ సెంటర్ వాళ్లకు విషయాన్ని తెలియజేసేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. రాజస్థాన్ (Rajasthan) ఉదయ్‌పూర్(Udaipur)కి చెందిన రాజ్‌కుమార్(Rajkumar) అనే వ్యక్తి. అక్షరాల 17.5లక్షలతో షోరూంలో క్రెటా కారు కొనుక్కున్నాడు. కారును షోరూం నుంచి తెచ్చిన నెల రోజులకు అది మొరాయించింది. పదే పదే స్టార్టింగ్ సమస్య రావడంతో షోరూం వాళ్లకు సమాచారం ఇచ్చాడు. సమస్య ఏంటో చూడమని కంప్లైంట్ చేస్తే ..ఎవరూ స్పందించకపోవడంతో ఎలాగైనా షోరూం నిర్వహకులకు తగిన బుద్ధి చెప్పాలని ఆగిపోయిన కారుకు తాడు కట్టి దాన్ని ఓ గాడిద (Donkey)తో షోరూం వరకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో (Video)ఇప్పడు సోషల్ మీడియా(Social media)లో విస్తృతంగా వైరల్ అవుతోంది.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని మద్రు పారిశ్రామిక ప్రాంతంలోని కారు షోరూంలో రాజ్‌కుమార్ అనే వ్యక్తి నెల రోజుల క్రితం 17.5 లక్షలు చెల్లించి క్రెటా కారును కొనుగోలు చేశాడు. అయితే ఆ కారుకి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా రాకముందే స్టార్టింగ్ ప్రాబ్లమ్ రావడంతో డీలర్‌ను సంప్రదించాడు. అయితే కారు షోరూం నుంచి వచ్చిన మెకానిక్‌లు రాజ్‌కుమార్ కారు సమస్యను తాత్కాలికంగా పరిష్కరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత కారును తీసుకొని వివాహ వేడుకకు వెళ్లాడు. అక్కడ కూడా కారు మొరాయించింది.









