మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంక్షోభం, కీలకమైన హార్ముజ్ జలసంధిలో రవాణాకు ఎదురవుతున్న అంతరాయాల నేపథ్యంలో భారత్ తన ఇంధన సరఫరా వ్యూహాన్ని వేగంగా మార్చుకుంది. ఈ క్రమంలో అమెరికా ప్రస్తుతం భారత్‌కు అత్యధిక LPG సరఫరా చేస్తున్న దేశంగా అవతరించింది. భారత్ దిగుమతి చేసుకుంటున్న LPGలో దాదాపు 67 శాతం అమెరికా నుంచే వస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన హర్దీప్ సింగ్ పురి.. మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి LPG దిగుమతులు తగ్గినప్పటికీ, దేశంలో ఇంధన కొరత ఏర్పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను వేగంగా అభివృద్ధి చేసిందని తెలిపారు. హార్ముజ్ జలసంధి ద్వారా ఇంధన రవాణాకు అంతరాయాలు ఎదురైన సమయంలోనూ సరఫరా వ్యవస్థను కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దేశీయ LPG ఉత్పత్తిని కూడా పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ వనరులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇంధన భద్రతను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. దీంతో మధ్యప్రాచ్య సంక్షోభం నేపథ్యంలో భారత్ తన LPG సరఫరా వ్యవస్థను వేగంగా పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.








