తమిళనాడు రాజకీయాల్లో తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ హీరో విశాల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కావేరి జలాలు, మేకెదాటు డ్యామ్ వివాదంతో పాటు నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు, అనంతరం ఆయన అరెస్ట్ వంటి పరిణామాలతో తమిళ రాజకీయాల్లో వేడి పెరిగింది. ఈ నేపథ్యంలో విశాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
తన తాజా సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన విశాల్.. తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు. చెన్నైలోని లయోలా కాలేజీలో చదువుకునే సమయంలో విజయ్ తమకు సీనియర్ అని, ఉదయనిధి స్టాలిన్ తన బ్యాచ్‌మేట్ అని తెలిపారు. అప్పట్లో విజయ్ సినీ రంగంలో ఉండగా, ఉదయనిధి తమతో కలిసి చదువుకునేవారని గుర్తు చేసుకున్నారు. ఈ ఇద్దరూ భవిష్యత్తులో తమిళ రాజకీయాల్లో కీలక వ్యక్తులుగా మారతారని అప్పట్లో ఊహించలేదని చెప్పారు.
అంతేకాదు.. తమ కాలేజీ సీనియర్ అయిన విజయ్, తమ బ్యాచ్‌మేట్ ఉదయనిధిని ఇలా అరెస్ట్ చేయించే పరిస్థితి వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని విశాల్ వ్యాఖ్యానించారు. గత జ్ఞాపకాలను ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ముడిపెడుతూ విశాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్, ఉదయనిధి మధ్య పెరుగుతున్న రాజకీయ విభేదాల నేపథ్యంలో విశాల్ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.








