వర్షాకాలంలో వాతావరణంలో తేమ, చల్లదనం పెరగడంతో చేతులు, కాళ్ల గోళ్లు బలహీనంగా, పెళుసుగా మారే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు తేమలో ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే ఈ సీజన్‌లో గోళ్లను శుభ్రంగా, పొడిగా ఉంచడంతో పాటు వాటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం.
గోళ్లకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను ఒనికోమైకోసిస్ (Onychomycosis) అంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు గోళ్ల రంగు మారడం, అవి మందంగా మారడం, పెళుసుగా తయారవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా తేమ ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో ఫంగస్ పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో గోళ్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.
అధిక తేమ కారణంగా గోళ్లు మెత్తబడటంతో పాటు అసమానంగా పెరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో గోళ్లు చర్మంలోకి పెరగడం వల్ల నొప్పి, ఎర్రదనం, వాపు వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. కాబట్టి వర్షాకాలంలో చేతులు, కాళ్లను శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరబెట్టుకోవడం, తడిగా ఉన్న సాక్స్ లేదా షూలను ఎక్కువసేపు ఉపయోగించకపోవడం, గోళ్లను క్రమం తప్పకుండా శుభ్రంగా కత్తిరించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.








