AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

Meta: డీప్‌ఫేక్, CSAMపై కఠిన చర్యలు.. మెటాకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

డీప్‌ఫేక్ వీడియోలు, చిన్నారులపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్ (CSAM), గుర్తింపు లేకుండా రూపొందుతున్న సింథటిక్ కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి హానికరమైన కంటెంట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి వేగంగా గుర్తించి తొలగించేలా చర్యలు తీసుకోవాలని మెటాకు కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. వినియోగదారుల భద్రతకు ముప్పుగా మారుతున్న కృత్రిమ కంటెంట్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల మెటా ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించింది. ఈ చర్చల్లో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. మెటా తరఫున గ్లోబల్ అఫైర్స్ హెడ్ జోయెల్ కప్లాన్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సమావేశాలకు హాజరైంది. డీప్‌ఫేక్‌లు, చిన్నారులకు హానికరమైన కంటెంట్ వంటి అంశాలపై ప్రభుత్వం మెటా నుంచి వివరణ కోరింది.

అంతేకాకుండా బాట్ అకౌంట్లను నియంత్రించడం, కృత్రిమంగా రూపొందించిన కంటెంట్‌ను గుర్తించడం, వినియోగదారులకు కంటెంట్‌ను సిఫార్సు చేసే అల్గోరిథమ్‌ల పనితీరుపైనా కేంద్రం ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ముఖ్యంగా చిన్నారులకు హాని కలిగించే కంటెంట్ విషయంలో వేగంగా స్పందించే వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ నియంత్రణపై మెటాపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది.

ANN TOP 10