సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతా
జోగురామన్న అక్రమాలపై బరాబర్ ప్రశ్నిస్తా
బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి
ఆదిలాబాద్: ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎవరెన్ని అక్రమ కేసులు బనాయించినా, కుట్రలు పన్నినా బరాబర్ ప్రశ్నిస్తూనే ఉంటానని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రజా సేవాభవన్ వేదికగా.. ఎమ్మెల్యే జోగు రామన్న, ఆయన కుమారుల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక కక్షగట్టి తన తల్లిదండ్రులు, ఆత్మీయులపై కేసులు నమోదు చేయిస్తావా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. వ్యవసాయం తప్ప రాజకీయాలు అసలే తెలియని నన్ను కన్నవారిని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిస్తావా అంటూ మండిపడ్డారు. ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమంపై ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా దౌర్జన్యంగా కేసులు పెట్టించి గొంతునొక్కాలని చూడడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు.

తాను ధర్మయుద్ధం చేస్తున్నానని, అందుకే జోగు రామన్న అధికారాన్ని ఉపయోగించి తన ఆఫీసులు కూల్చేందుకు జేసీబీలు పంపిస్తున్నారని అన్నారు. తనకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, ప్రతిస్పందనను చూసి ఓర్వలేకనే ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. నాలుగుసార్లు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజలు ఓడిపోయారన్నారు. ప్రజలను బానిసలుగా మార్చి జోగు రామన్న పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. 9 ఏండ్లలో ఎంతమందికి ఇండ్లు ఇచ్చారంటూ ప్రశ్నించారు. పైగా ఇచ్చిన హామీలను విస్మరిస్తూ వెకిలి నవ్వులు నవ్వడం నీకే చెల్లిదంటూ విమర్శించారు. మీడియా సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్‌కర్ శంకర్, బీజేపీ నాయకులు గిమ్మ సంతోష్‌రావు, పుండ్రు రవికిరణ్, పద్మ, సంతోష్ రెడ్డి, సంజీవ్, కిష్టారెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.









