టీ సేవ్ నిరాహార దీక్షలో గద్దర్
వైఎస్సార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) తెలుగు తల్లి, తెలంగాణ బిడ్డ అని ప్రజాయుద్ధ నౌక గద్దర్ (Gaddar) అన్నారు. టీ సేవ్ (T-Save) ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష గద్దర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిరుద్యోగులకు ఉద్యోగాలు అనే నినాదంతో షర్మిల తన పోరాటం మొదలు పెట్టారని తెలిపారు. మొన్నటి వరకు మంత్రులు ఎక్కడున్నారో ఎవరికి తెలియలేదని.. 30 నుంచి అందరూ మన ముందే ఉంటారన్నారు. లైబ్రరీలో పిల్లల మొహాలు వాడుతున్నాయని తెలిపారు. ఇంటికి పోలేక, ఇక్కడ తిండి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. యువత శక్తిని ఇండియా వాడుకోలేకపోతోందని అన్నారు. ‘‘మై హోం’’ కి ‘‘నో హోం’’కి ఉన్న తేడా గమనించాలన్నారు. తాను ఏ పార్టీ సభ్యుడిని కాదని స్పష్టం చేశారు. షర్మిల ఆత్మ రక్షణ కోసం డిఫెన్స్ చేసుకున్నారని ఆయన తెలిపారు.
మన దగ్గర ఉద్యమాలు ఉన్నాయి. విద్యార్థులు రాజకీయ శక్తిగా మారాలి. మనం పిల్లులతో కొట్లాడుతున్న ఎలుకలం’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. షర్మిల రాజకీయ శక్తిగా మారింది కాబట్టే ఆమెని ఇంటి నుంచి బయటకి రానివ్వడం లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ వచ్చాక కన్నీళ్లు తప్ప ఏం రాలేదన్నారు. కేసీఆర్ కూలిపోయేలా ప్రణాళికతో ముందుకు వెళ్లి ఆయన్ని కూలగొట్టాలని పిలుపునిచ్చారు. షర్మిల తెలంగాణ నాడి పట్టుకున్నారన్నారు. అసెంబ్లీనీ, సెక్రెటరేయెట్‌ను విద్యార్థులు చుట్టు ముట్టాలని పిలుపునిచ్చారు.కేసీఆర్ పతనమయ్యే దశ వచ్చిందని గద్దర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీ సేవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర జరుగుతున్న నిరాహార దీక్షలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల, పలు రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సర్కార్ కళ్ళు తెరిపించేందుకే నిరుద్యోగుల కోసం కొట్లాట అనే నినాదంతో నిరాహార దీక్ష చేపట్టారు.









