తిరుమల దర్శనానికి వెళుతున్న భక్తులకు శుభవార్త. కొండపై భక్తుల రద్దీ తగ్గిపోయింది. రెండు రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.. వీకెండ్‌లో కూడా రద్దీ కనిపించలేదు. మంగళవారం శ్రీవారి దర్శనం కోసం కేవలం ఒక్క కంపార్ట్‌మెంటులో మాత్రమే వేచి ఉన్నారు.. దీంతో టీటీడీ భక్తుల్ని నేరుగా దర్శనానికి అనుమతిస్తోంది. స్వామివారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 3 గంటల సమయం మాత్రమే పడుతోంది. మరోవైపు సోమవారం తిరుమల వెంకన్నను 63,870 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. స్వామివారికి 27,480 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
సాధారణంగా వేసవికాలంలో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో పాటూ వేసవి సెలవులు కూడా ఇస్తారు. దీంతో రద్దీ విపరీతంగా ఉంటుంది.. కానీ ఈసారి మాత్రం పరిస్థితి రివర్స్‌లో ఉంది. భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడంతో.. కంపార్ట్‌మెంట్లలో వేచి చూడకుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే మరో రెండు మూడు రోజుల్లో భక్తుల రద్దీ పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. జులై నెలాఖరు వరకు రద్దీ కొనసాగుతుందని భావిస్తున్నారు. రద్దీని బట్టి ఏర్పాట్లు చేస్తామంటున్నారు.
మరోవైపు మే, జూన్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేసింది టీటీడీ. రెండు నెలలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇవాళ 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. వీటితో పాటుగా మే, జూన్ నెలలకు సంబంధించిన వసతి గదులను కూడా ఈ నెల 26న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.









