ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో పర్యటించారు. జగనన్న వసతి దీవెన లబ్ధిని బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలకు దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని జమ చేశారు. ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు.. పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు.. డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులకు రూ. 20 వేలు అందిస్తున్నారు. ఇది జగనన్న విద్యాదీవెనకు తోడుగా అందిస్తున్న జగనన్న వసతి దీవెన అని గుర్తు చఏశారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ పూర్తిగా విద్యార్థులకు అందిస్తున్నామన్నారు.
నార్పల సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్ జగన్ సెటైర్లు పేల్చారు. ఈ మధ్య జాతీయ మీడియాకు ఒక ముసలాయన వచ్చీ రాని భాషలో ఇంటర్వ్యూ ఇచ్చారని.. ఆయన మాటలు వినేప్పుడు తనకు పులి కథ గుర్తుకు వచ్చిందన్నారు. ‘నరమాంసం తినే పులి ముసలిదైపోయిందట.. వేటాడే శక్తి, పరిగెత్తే ఓపిక లేకపోవడంతో ఓ నాలుగు నక్కలను తోడేసుకుందట. మనుషుల్ని తినేందుకు ప్లాన్ వేసి.. ఒక ముడగు పక్క కూర్చుని.. వచ్చీపోయే మనుషులకు కడియం కావాలంటే నీటిలో మునగాలి అని ఆశ పెట్టేదట. ఈ పులిని నమ్మితే తినేస్తుంది అని అందరూ నమ్మకుండా పోయారు’ అని కథ చెప్పుకొచ్చారు.
‘నేను అడవిలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ ఉంది. గతంలో బాగా తినేవాడని.. ఇప్పుడు మంచోడినైపోయినని నమ్మించేది.. రామా.. కృష్ణా.. అంటూ మంచి కార్యక్రమాల కోసమే ఉన్నాను అని చెప్పేది. నమ్మిన వాళ్లూ మడుగులో వెళ్లి నీట మునిగి ఆ నగలు తీసుకునే ప్రయత్నం చేసేవాళ్లు.. వాళ్లను పులి చంపేసి తినేసేది’ అని కథను వివరించారు. వెన్నుపోటు పొడిచేవాళ్లను, అబద్ధాలు చెప్పేవాళ్లను ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదు అన్నారు.. ఇదంతా వింటే అబద్ధాలు చెప్పే ఓ ముసలాయాన చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు.









