ఓడిపోతే రాజకీయ సన్యాసం.. రేణుకా చౌదరికి సవాల్ విసిరిన మంత్రి పువ్వాడ
ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలో మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే పోటీ చేసి తనపై గెలవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి కి సవాల్ విసిరారు. ‘ నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. అన్ని పార్టీ లకు ఖమ్మం టార్గెట్ అయ్యింది. ఇక్కడకు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. కొన్ని పార్టీ ల నేతలకు నేను కలలో కూడా కనిపిస్తున్నాను. వారికి నిద్ర పట్టడం లేదు. అరేయ్..ఒరేయ్.. వాడు వీడు అంటూ నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర నాకు లేదు. నా తల్లి దండ్రులు నాకు సభ్యత, సంస్కారం నేర్పారు. నీ చరిత్ర ఏంటి టికెట్స్ ఇస్తామని గిరిజనుల దగ్గర డబ్బులు వసూలు చేశావు. ఎన్నికల సమయంలో సీజనల్ పక్షుల్లా వచ్చి టికెట్స్ డబ్బులకు అమ్ముకుంటారు. నీవు ఖమ్మం కు చేసిన అభివృద్ధి ఏంటి? కనీసం మంచి నీరు కూడా ఇవ్వలేదు. నేను కొండలను మింగుతున్నాను అని అంటున్నారన్నారు.
.
‘మీలాగా నేను గుడులు ,కొండలను మింగలేదు. నేను ప్రజల్ని ముంచి రాజకీయం చేయలేదు. నాపై మాట్లాడినా ప్రతి మాటకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. న్యాయ పరంగా కూడా ఎదుర్కోవాలి. ఏమి మాట్లాడినా ఇకనుంచి ఊరుకునేది లేదు. నేను ఏ కొండలను మింగాను..ఏం దౌర్జన్యం చేశానో మీడియా నిజ నిర్దారణ చేయాలి. మీరే వెలికి తీయాలి. నేను ఇక్కడే పుట్టాను..ఇక్కడే పెరిగాను.. నీ చరిత్ర ఏంటి.. నీ పిల్లలు డ్రగ్స్ , పబ్బు ల్లో పట్టుబడ్డారు. మా పిల్లలను అలా పెంచలేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి పువ్వాడ.









