మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి రేవంత్ రెడ్డి రూ.25 కోట్లు తీసుకున్నారన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణలపై.. రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేశారు. తాను బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకోలేదని రేవంత్ ప్రమాణం చేశారు.ఈటల కోసం టెంపుల్ దగ్గర వెయిట్ చేసిన రేవంత్.. తడిబట్టలతో ప్రమాణం చేద్దాం రా అంటూ సవాల్ చేశారు. అమ్మవారి సాక్షిగా చెబుతున్నానని, ఈటల తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. కేసీఆర్‌తో తమకు ఎలాంటి లాలూచీ లేదని.. ఆఖరు శ్వాస వరకు కేసీఆర్‌తో కొట్లాడుతానని స్పష్టం చేశారు. రాజీ నా రక్తంలో లేదని.. అమ్మవారిపై ఒట్టేసి చెబుతున్నానని.. కేసీఆర్ దగ్గర మేం ఒక్క రూపాయి తీసుకోలేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టుకున్నారు.తీవ్ర భావోద్వేగానికి గురైన రేవంత్‌రెడ్డి.. ఇంకోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.
‘కేసీఆర్ సర్వం ధారబోసినా నా కాలిగోటిని తాకలేడని’ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ దోపిడీని నిలదీస్తే తనను జైల్లో పెట్టారని.. నోటీసులు ఇవ్వగానే ఈటలలా తాను పారిపోలేదని తెలిపారు. బీఆర్‌ఎస్ నేతలు వేలాది ఎకరాలు కొల్లగొట్టారని ఆరోపించారు. కేటీఆర్ ఫామ్‌హౌస్ ను బయటపెట్టినందుకు తనను అరెస్ట్ చేశారన్నారు. చర్లపల్లి జైల్లో తీవ్రవాదులు ఉండే సెల్‌లో ఉంచారని.. కేసీఆర్ తనను నిర్బంధించినా ధైర్యంగా నిలబడ్డానన్నారు. కేసీఆర్ అవినీతిపై కొట్లాడుతున్న తమపై ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు.’ఓయూ విద్యార్థుల సాక్షిగా మేం పోరాడింది వాస్తవం కాదా.. TSPSC ఘటనలో ఈడీ కేసు వేయించింది నేనే.. డబ్బు తీసుకుంటే కేసీఆర్ కళ్లలోకి చూసే ధైర్యం నాకు ఉంటుందా..’అని రేవంత్ అడిగారు.
ముఠాలతో, మూటలతో మునుగోడు ఉపఎన్నికలో దిగారని.. మునుగోడులో 300 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని.. ప్రజలను మత్తులో ముంచి ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. చుక్కమందు పోయకుండా గెలవాలని.. యాదాద్రిలో ప్రమాణం చేద్దామని పాల్వాయి స్రవంతి సవాల్ విసిరారని గుర్తుచేశారు. ఇచ్చిన సవాల్‌కు కట్టుబడి పాల్వాయి స్రవంతి పోటీ చేశారని.. 25 వేల మంది ఓటర్లు స్రవంతి పక్షాన నిలబడ్డారని చెప్పారు.ఎన్నికల్లో నిజాయితీగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒత్తిడిని తట్టుకుని పోటీ చేశామని.. కాంగ్రెస్ అమ్ముడుపోయిందని ఈటల అంటున్నారని ఫైర్ అయ్యారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తే సహించమని హెచ్చరించారు.









