సాయి ధరమ్ కు చరణ్ విషెస్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత విరూపాక్ష ద్వారా సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. తాను కెమెరా ముందుకు మళ్లీ కొత్తగా వచ్చినట్టు అనిపించిందని ప్రమోషన్స్ లో సాయితేజ్ చెబితే, ఎలా చేశాడో ఏంటోనని అంతా అనుకున్నారు. కానీ సినిమా సూపర్ హిట్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా, నిన్ననే థియేటర్లకు వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి టాక్ వస్తుండటం పట్ల మెగాస్టార్ సంతోషాన్ని వ్యక్తం చేయడం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమాతో హిట్ అందుకున్నందుకు సాయితేజ్ కి ట్విట్టర్ ద్వారా చరణ్ అభినందనలు తెలియజేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజున 12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. రెండో రోజున వసూళ్లు పెరిగినట్టుగా చెబుతున్నారు. ఇక ఆదివారం కూడా ఈ సినిమా వసూళ్లు ఒక రేంజ్ కి చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.









