ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలను తమ వైపునకు ఆకర్శించేందుకు తెలంగాణలోని గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించింది. ప్రయాణికుల సౌకర్యార్థం కల్పిస్తోన్న వివిధ కార్యక్రమాలను వివరించి.. టీఎస్‌ఆర్టీసీని ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకే విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థకు రూపకల్పన చేసింది. విలేజ్ బస్ ఆఫీసర్ల నియామకం, వారి విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఐపీఎస్ గారు జారీ చేశారు. బస్ ఆఫీసర్లను వీలైనంత త్వరగా నియమించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ బస్ ఆఫీసర్ల వ్యవస్థ మే ఒకటో తేది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
గ్రామాల్లో నివాసించే సంస్థ కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులను విలేజ్ బస్ ఆఫీసర్లగా డిపో మేనేజర్లు నియమిస్తారు. నియామకాల్లో ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలుండి.. స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకువచ్చే వారికి ప్రాధాన్యం ఇస్తారు. పెద్ద గ్రామానికి ఒకరు బస్ ఆఫీసర్‌గా ఉంటారు. చిన్నవైతే రెండు, మూడు గ్రామాలకు ఒకరిని నియమిస్తారు. ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఒక్కరికి 5 గ్రామాల కంటే ఎక్కువగా కేటాయించేందుకు వీల్లేదు.
హైదరాబాద్ సహా మిగతా మున్సిపాలిటీల్లోనూ వార్డుకో బస్ ఆఫీసర్‌ను డిపో మేనేజర్లు నియమిస్తారు. వారు ఆయా వార్డుల పరిధిలో విలేజ్ బస్ ఆఫీసర్లలాగే పనిచేస్తారు. ఈ విలేజ్ బస్ ఆఫీసర్లు గ్రామస్థులతో నిత్యం టచ్‌లో ఉంటారు. ఈ బస్ అధికారులు 15 రోజులకోసారి గ్రామస్తులతో సమావేశమవుతారు. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్‌లు, కొత్త సర్వీస్‌లు, సమస్యలు, తదితర అంశాల గురించి సమాచారాన్ని సేకరిస్తారు. ఆ సమాచారాన్ని పై అధికారులకు చేరవేస్తారు. గ్రామాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు, జాతరల వివరాలను వారు సేకరిస్తారు. రద్దీ ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్టుగా బస్ ట్రిప్పులను పెంచుతారు. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాలకు తమ అద్దె బస్సులను ఉపయోగించుకోవాలని వివరిస్తారు.









