ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర శనివారం (ఏప్రిల్ 22న) నుంచి ప్రారంభమైంది. ఏడాదిలో ఆరు నెలల పాటు సాగే ఈ యాత్ర ఏటా అక్షయ తృతీయ రోజున అధికారికంగా ప్రారంభమవుతుంది. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ల సందర్శనే చార్‌ధామ్ యాత్రగా పిలుస్తారు. సుమారు 12,000 అడుగుల ఎత్తున హిమగిరుల్లో ఉండే ఈ క్షేత్రాలు.. హిందూ మతంలోని ముఖ్యమైన శైవం, వైష్ణవం, శాక్తేయం కలిసి ఉంటాయి ఏటా అక్షయ తృతీయ నుంచి దీపావళి మర్నాడు వచ్చే యమద్వితీయ వరకు ఆరు నెలలు ఈ ఆలయాలను భక్తుల కోసం తెరుస్తారు. మిగతా కాలం అక్కడంతా మంచుతో కప్పి ఉంటుంది.
యాత్రలో భాగంగా మొదట యమునోత్రి, గంగోత్రి.. తర్వాత కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను తెరుస్తారు. యమునోత్రి, గంగోత్రి క్షేత్రాలు శనివారం ప్రారంభించారు. కేదార్‌నాథ్ ఆలయం ఏప్రిల్ 25న, బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 27న తెరుచుకుంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ రుద్రప్రయాగలోని ఉఖిమఠ్‌లో పూజలు అందుకున్న కేదారేశ్వరుడ్ని పలకీలో శుక్రవారం కేదార్‌నాథ్‌కు తరలించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఉఖిమఠ్‌కు తరలివచ్చారు. రాత్రికి గుప్త కాశీకి చేరుకుని అక్కడే విడిది చేశారు. అక్కడ నుంచి ఏప్రిల్ 24కు కేదార్‌నాథ్‌కు పల్లకి చేరుకోనుంది.
కేదార్‌నాథ్ క్షేత్రపాలకుడు భైరవనాథ్ గురువారం సాయంత్రమే తరలివెళ్లారు. మరోవైపు, చార్‌ధామ్ యాత్రికులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. కోవిడ్ కేసుల ప్రభావం, హిమాలయ ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్య సూచనలు జారీ చేసింది. అన్ని పుణ్యక్షేత్రాలు ఎత్తైన హిమాలయ ప్రాంతంలో ఉన్నాయని, సముద్ర మట్టానికి 2,700 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయని మార్గదర్శకాల్లో పేర్కొంది. విపరీతమైన చలి, గాలిలో పీడనం, తేమ, ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయని హెచ్చరించింది. యాత్రికులందరికీ సాఫీగా, సురక్షితమైన ప్రయాణం కోసం మార్గదర్శకాలను అనుసరించాలని పేర్కొంది.









