
ఈ రోజు నుంచి పవిత్ర గంగానది పురష్కారాలు ప్రారంభమయ్యాయి. గంగామాతను ఎల్లప్పుడూ కోట్లాది మంది హిందువులు పూజిస్తారు. ఈ నేపథ్యంలో జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైన కాశీలో గంగా స్నానం కోసం భక్తులు చేరుకున్నారు. కాశి భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి.. పద్నాలుగు భువన బాండాలలో విశేషమైన స్థలం వారణాసిలో ప్రవహిస్తున్న గంగమ్మ చెంతకు భక్తులు పరుగులు పెడుతున్నారు. కాశీలో గంగమ్మ తీరాన ఉన్న ఘాట్లను దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించిన ఘాట్లు ఎన్నో వున్నాయి. గంగా పుష్కరాల కోసం వారణాసిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.
ప్రపంచ దేశాల్లో అతి పురాతన నగరం వారణాసి. గంగా నది ఒడ్డున వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. గంగా నది కేవలం ఒక ప్రవాహం మాత్రమే కాదు. ప్రాచీన కాలం నుండి భారతదేశపు తపస్సుకు సాక్ష్యం గంగానది. నదులను పవిత్రంగా భావించి పూజిస్తారు. 12 ఏళ్లకు వచ్చే పుష్కరాల్లో భక్తులు స్నానమాచరిస్తారు. జన్మ తరించినట్లు భావిస్తారు.
దేశ వ్యాప్తంగా యాత్రికులు కాశి నగరానికి తరలి వెళ్ళుతున్నారు. ముఖ్యంగా కాశీలోని గంగా స్నానం చేయడానికి భారీగా తెలుగు యాత్రికులు తరలివెళ్తున్నారు. తెలుగు యాత్రికులను దృష్టిలో పెట్టుకొని NDRF సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలుగు తెలిసిన సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం, అనంతరం డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యమని భావించి భక్తులు దర్శనం కోసం ఆలయాల వద్ద బారులు తీరారు.









