పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ జ్వాలలు సముద్ర మార్గాలకు పాకాయి. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికాకు చెందిన ఒక భారీ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ నౌకాదళం సూసైడ్ బోటుతో మెరుపు దాడికి పాల్పడింది. అత్యంత భీతావహంగా జరిగిన ఈ ఘటనలో దురదృష్టవశాత్తు ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోగా, నౌకలోని ఇతర సిబ్బంది భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గత నెలలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిచర్యగా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ దాడి జరిగిన సమయంలో నౌకలో అధిక సంఖ్యలో భారతీయ సిబ్బంది ఉన్నారు. సూసైడ్ బోటు వేగంగా వచ్చి ట్యాంకర్‌ను ఢీకొనడంతో భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. హర్మూజ్ జలసంధి సమీపంలో జరిగిన ఈ అమానుష ఘటన హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలా ఉందని ప్రత్యక్ష సాక్ష్యులు వివరిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మిగిలిన భారతీయ నావికులను ఇరాక్ అధికారులు సకాలంలో స్పందించి రక్షించగలిగారు.
ప్రస్తుతం హర్మూజ్ జలసంధి ప్రాంతంలో అనేక నౌకలు చిక్కుకుపోయి ఉన్నాయి, వాటిలో వందలాది మంది భారతీయులు పని చేస్తున్నారు. ఇరాన్ వరుస హెచ్చరికల నేపథ్యంలో ఈ ప్రాంతంలో నౌకాయానం అత్యంత ప్రమాదకరంగా మారింది. భారత ప్రభుత్వం తమ పౌరుల భద్రత కోసం అంతర్జాతీయ దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా మరియు నావికుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.








