నటుడు విజయ్ దేవరకొండతో వివాహం తర్వాత తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిగత దాడులపై రష్మిక మందన్న తీవ్రంగా స్పందించారు. గత ఎనిమిదేళ్లుగా ఒక వర్గం తన మాటలను వక్రీకరిస్తూ, ద్వేషాన్ని పెంచుతూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రిటీగా విమర్శలు సహజమని ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, కానీ గడిచిన 24 గంటల్లో జరిగిన పరిణామాలు అన్ని హద్దులు దాటేశాయని ఆమె పేర్కొన్నారు.
ముఖ్యంగా ఎనిమిదేళ్ల క్రితం నాటి ఒక ప్రైవేట్ సంభాషణను అనుమతి లేకుండా రికార్డ్ చేసి, ఇప్పుడు కావాలనే వివాదం సృష్టించడంపై రష్మిక మండిపడ్డారు. తన ప్రైవసీకి భంగం కలిగిస్తూ, తన కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగి ఇబ్బంది పెడుతున్నారని ఆమె వాపోయారు. వ్యూస్ కోసం ఒకరి వ్యక్తిగత జీవితాన్ని తాకట్టు పెట్టడం సరికాదని, తన జీవితంపై నిర్ణయాలు తీసుకునే హక్కు ఇతరులకు లేదని ఆమె స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో, తప్పుడు కంటెంట్‌ను ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు మరియు ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఆమె 24 గంటల గడువు విధించారు. ఈ లోపు ఆ కంటెంట్‌ను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని రష్మిక గట్టిగా హెచ్చరించారు. గతంలో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం రద్దు కావడం వంటి పాత విషయాలను ఇప్పుడు పెళ్లి సమయంలో వైరల్ చేస్తూ వేధిస్తుండటంతో ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.








