ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా ‘స్వయం’ (Swayam) పేరిట బ్రాండింగ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. 6వ జిల్లాల కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ ఉత్పత్తులకు సంబంధించి ప్రత్యేక లోగోను కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు. బిలియన్ డాలర్ల కంపెనీలకు ఉండే విశ్వసనీయత డ్వాక్రా మహిళలకు ఉందని, వారు తీసుకునే రుణాలను సక్రమంగా తిరిగి చెల్లిస్తారనే నమ్మకం బ్యాంకర్లలో ఉందని ఆయన ప్రశంసించారు.
అమూల్ డైరీ తరహాలోనే సహకార విధానంలో డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ జరగాలని సీఎం సూచించారు. బ్రాండింగ్ లేకపోతే నాణ్యమైన ఉత్పత్తులకు కూడా సరైన విలువ లభించదని, అందుకే గ్లోబల్ మార్కెట్‌కు చేరేలా ప్రమాణాలను పెంచాలని అధికారులను ఆదేశించారు. ఉత్పత్తుల నాణ్యతతో పాటు వాటికి ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ఉండేలా చూడాలని, ఇది ‘స్వయం’ బ్రాండ్ అభివృద్ధికి అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 28 ప్రత్యేక బ్రాండ్లను రూపొందించి, వాటి మధ్య పోటీని పెంచడం ద్వారా మహిళా సాధికారతకు బాటలు వేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా, డ్వాక్రా ఉత్పత్తులు బిలియనీర్ కంపెనీల ఉత్పత్తులతో పోటీ పడేలా ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.








