చారిత్రక నేపథ్యం కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ (AU) కి పూర్వవైభవం తీసుకువస్తామని, దీనిని ప్రపంచస్థాయి ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ మరియు ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ వేడుకలను చరిత్రలో నిలిచిపోయేలా అత్యంత ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ శతాబ్ది ఉత్సవాలు మార్చి 26 నుంచి ఏప్రిల్ 26 వరకు నెల రోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, దేశ విదేశాల్లో ఉన్న ఏయూ పూర్వ విద్యార్థులను (Alumni) ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు. వారి విజయగాథలు ప్రస్తుత విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా కార్యక్రమాలు రూపొందించాలని, కేవలం యూనివర్సిటీకే పరిమితం కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ ఈ సంబరాల్లో భాగం చేయాలని చెప్పారు. వర్సిటీ రాబోయే వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక పక్కా ‘యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
సమీక్షలో భాగంగా వీసీ రాజశేఖర్ శతాబ్ది స్థాపన దినోత్సవ అజెండాను, వర్సిటీలో చేపట్టబోయే అభివృద్ధి పనులను మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని, యూనివర్సిటీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేలా ఉత్సవాలను నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. సాంస్కృతిక కార్యక్రమాలు, మేధో సదస్సులతో పాటు ప్రస్తుత విద్యార్థుల భాగస్వామ్యంపై కూడా మంత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.








