తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల కోసం కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (వీహెచ్) తన అభ్యర్థిత్వాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న తన శ్రమను గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరియు అధిష్ఠానం తప్పకుండా అవకాశం ఇస్తారనే పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. “పార్టీలో కష్టపడే వారికే పదవులు దక్కుతాయి” అని రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తనకు సానుకూలంగా మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తన రాజకీయ జీవితంలో గాంధీ కుటుంబానికి విధేయుడిగా, పార్టీకి ఒక సిపాయిగా పనిచేశానని వీహెచ్ గుర్తుచేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తనపై అత్యధికంగా కేసులు నమోదైనప్పటికీ, వెనకడుగు వేయకుండా పార్టీ జెండా మోశానని తెలిపారు. ఇప్పటికే ఈ విషయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని, సోనియా గాంధీకి కూడా లేఖ రాశానని వెల్లడించారు. గత పదేళ్లుగా తనకు ఎటువంటి పదవి లేదని, ఈసారి ఈ బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చి న్యాయం చేయాలని ఆయన కోరారు.
జాతీయ రాజకీయాల్లో తనకు ఉన్న విస్తృత పరిచయాలు పార్టీకి ప్లస్ అవుతాయని వీహెచ్ అభిప్రాయపడ్డారు. తాను ఢిల్లీలో ఉంటే ఇతర రాష్ట్రాల పార్టీలతో సమన్వయం చేసుకుని, రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన రాజకీయం ఎప్పుడూ నిస్వార్థంగానే సాగిందని, తనకు రెండుసార్లు అన్యాయం జరిగినా పార్టీని వీడలేదని గుర్తుచేశారు. కార్యకర్తలు కూడా ఓపిక పట్టాలని, తన పనితీరును బట్టి అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.








