కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయానికి (CMO) హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత వాట్సాప్ నంబర్లకు ప్రభుత్వ విజయాలను వివరిస్తూ ప్రచార సందేశాలు పంపడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేవలం వేతన చెల్లింపులు, పరిపాలన కోసం ఉద్దేశించిన ‘స్పార్క్’ (SPARK) పోర్టల్ నుంచి ఉద్యోగుల డేటాను అనధికారికంగా సేకరించి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. అనుమతి లేకుండా ఉద్యోగుల మొబైల్ నంబర్లను సేకరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం కల్పించిన వ్యక్తిగత గోప్యతా హక్కు (Right to Privacy) ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం 2023కు ఇది విరుద్ధమని వ్యాఖ్యానించింది. సుమారు 5.42 లక్షల మంది ఉద్యోగులు, లక్షలాది మంది పెన్షనర్లు మరియు సంక్షేమ పథకాల లబ్ధిదారుల సమాచారాన్ని ఇలా ప్రచారానికి వాడటంపై తక్షణమే వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రభుత్వ విజయాలను చాటిచెప్పే క్రమంలో 10 శాతం డీఏ పెంపు వంటి అంశాలను సీఎం ఫోటోతో సహా ఉద్యోగులకు పంపడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ గతంలోనే విమర్శలు గుప్పించింది. అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ డేటాబేస్‌ను రాజకీయ ప్రచారానికి వాడుకోవడంపై సోషల్ మీడియాలోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎన్నికల ముందు ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.








