AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బొత్స తీరుపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం: సోము వీర్రాజుపై వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజును ఉద్దేశించి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. శాంతిభద్రతలపై జరిగిన చర్చ సందర్భంగా సోము వీర్రాజుపై బొత్స వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఎవరినో మెప్పించడానికి సోము వీర్రాజు మాట్లాడుతున్నారన్న బొత్స వ్యాఖ్యలు అభ్యంతరకరమని, వాటిని వెంటనే సభా రికార్డుల నుంచి తొలగించాలని మండలి ఛైర్మన్‌ను లోకేశ్ డిమాండ్ చేశారు. వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేయడం బొత్సకు ఒక అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని మోదీ సభలో భద్రతా వైఫల్యాలను సోము వీర్రాజు ప్రస్తావించినప్పుడు ఈ వివాదం మొదలైంది. ఆనాడు కనీస భద్రత లేక బ్యారికేడ్లు విరిగిపోయాయని, ప్రధాని మాట్లాడుతుండగానే మైక్ కట్ అయిందని లోకేశ్ గుర్తు చేశారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి అధికారులపై చర్యలు తీసుకున్న విషయం బొత్స తెలుసుకోవాలని హితవు పలికారు. సభలో నిజాలు చెబుతుంటే వినకుండా ప్రతిపక్షం పారిపోవడం సరికాదని మండిపడ్డారు.

మధ్యాహ్నం రెండు గంటలు కాగానే ఆకలి వేసి వాకౌట్ చేయడం బొత్సకు ప్యాషన్‌గా మారిందని లోకేశ్ విమర్శించారు. సభలో సభ్యుల మధ్య గౌరవప్రదమైన చర్చ జరగాలని, వ్యక్తిగత దాడులు సరికాదని స్పష్టం చేశారు. హోంమంత్రి అనిత కూడా స్పందిస్తూ వైసీపీ సభ్యులు అబద్ధాలు చెప్పి సభ నుంచి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. లోకేశ్ డిమాండ్‌తో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది.

ANN TOP 10