AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చిన్నారి పునర్వికను ఆదుకోండి: రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం మంచు మనోజ్ భావోద్వేగ విజ్ఞప్తి

ప్రాణాంతకమైన ఎస్‌ఎంఏ (SMA) టైప్-1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడాలని టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ప్రభుత్వాలను, ప్రజలను అభ్యర్థించారు. ఈ వ్యాధి చికిత్స కోసం రూ.16 కోట్ల విలువైన ఒక అరుదైన ఇంజెక్షన్ అవసరమని, అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం ఆ పేద కుటుంబానికి సాధ్యం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ పెడుతూ, చిన్నారి పరిస్థితిని వివరించారు.

పునర్వికను కాపాడేందుకు ఇప్పటికే ఎందరో దాతలు ముందుకు వచ్చి #SavePunarvika హ్యాష్‌ట్యాగ్‌తో కోటి రూపాయలకు పైగా విరాళాలు సేకరించడం తనకు ఎంతో ఆశను కలిగించిందని మనోజ్ పేర్కొన్నారు. అయితే, చిన్నారికి సమయం చాలా తక్కువగా ఉందని, అందుకే భారత ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వెంటనే స్పందించి ఆ చిన్నారిని ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాల చొరవ ఉంటేనే ఈ ఖరీదైన చికిత్స సాధ్యమవుతుందని ఆయన గుర్తు చేశారు.

చిన్నారి ఆరోగ్యం చాలా సున్నితంగా ఉన్నందున ఎవరూ ఆమెను చూడటానికి వెళ్లవద్దని, కేవలం ప్రార్థనలు మరియు విరాళాల ద్వారానే మద్దతు తెలపాలని మనోజ్ కోరారు. “ఈ చిన్నారిని మనం కాపాడుకోగలిగితే అది మన మానవత్వానికి దక్కే విజయం” అని ఆయన పేర్కొన్నారు. సాయం చేయాలనుకునే వారు 7799279441@indianbk అనే యూపీఐ ఐడీకి తమ వంతు విరాళం పంపాలని ఆయన విన్నవించారు.

ANN TOP 10