టీ20 వరల్డ్ కప్ సూపర్-8 దశలో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరగనున్న కీలక పోరుకు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. అభిషేక్ గురించి తాను ఏమాత్రం ఆందోళన చెందడం లేదని, అతను మళ్లీ ఫామ్‌లోకి వస్తే అతడిని ఎదుర్కోబోయే ప్రత్యర్థి జట్ల పరిస్థితి ఏంటో అని తాను టెన్షన్ పడుతున్నానని తనదైన శైలిలో చమత్కరించారు.
గత ఏడాది అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శన చేశాడని, ఇప్పుడు అతనికి జట్టు యాజమాన్యం నుంచి పూర్తి మద్దతు అవసరమని సూర్య పేర్కొన్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ 250 పరుగులు చేయాల్సిన అవసరం లేదని, పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం ముఖ్యమని చెప్పారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ, పవర్ ప్లే తర్వాత ఎలా ఆడాలో తమకు తెలుసని, తదుపరి సవాళ్లను ఎదుర్కోవడానికి జట్టు సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.
దక్షిణాఫ్రికాతో జరగబోయే ఈ మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ 11లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంచనా. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా రానుండగా, తిలక్ వర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా వంటి హిట్టర్లతో మిడిలార్డర్ బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లతో పాటు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నారు. ఇప్పటివరకు టోర్నీలో ఓటమి ఎరుగని భారత్, ఇదే జోరును సూపర్-8లోనూ కొనసాగించాలని భావిస్తోంది.








