తన కుమారుడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కొందరు జర్నలిస్టులు తప్పుగా చిత్రించారని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని అస్మిత్ రెడ్డి అన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తోందని, ఆ పరిస్థితులపైనే అస్మిత్ రెడ్డి మాట్లాడారని ఆయన వివరణ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ తోనే తాము ముందుకు సాగుతున్నామని, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన పగలు, రాత్రి కష్టపడుతున్నారని ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. వైఎస్సార్‌సీపీ హయాంలో పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. చంద్రబాబు, నారా లోకేశ్ నాయకత్వంలో కూటమి నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారని, తాడిపత్రి అభివృద్ధి గురించి జగన్‌కు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఏప్రిల్ నాటికి తాడిపత్రికి సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తమ నియోజకవర్గంలో ఏర్పాటు చేశామని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో, తాము కూడా తాడిపత్రిని అదే స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.








