శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకే చేరవేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దేవాదాయ శాఖ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పవిత్ర కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సంస్థ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి శనివారం బస్ భవన్‌లో ఆవిష్కరించారు. భద్రాద్రి కల్యాణ వేడుకలకు నేరుగా వెళ్లలేని భక్తుల కోసం ఈ వినూత్న సేవను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ విశిష్ట తలంబ్రాల ప్యాకెట్లను పొందాలనుకునే భక్తులు రూ.151 చెల్లించి టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో లేదా సంస్థ అధికారిక వెబ్‌సైట్ (www.tgsrtclogistics.co.in) ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 23 నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయని సంస్థ వెల్లడించింది. నియమ నిష్టలతో, గోటితో ఒలిచిన కోటి బియ్యం గింజలతో సిద్ధం చేసిన ఈ తలంబ్రాలను, కల్యాణోత్సవం అనంతరం సంస్థ హోమ్ డెలివరీ ద్వారా భక్తులకు అందజేస్తుంది.
గత మూడేళ్లుగా ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, ఇప్పటికే లక్షలాది మంది ఈ సేవలను వినియోగించుకున్నారని ఎండీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లోనూ బుకింగ్ సదుపాయం ఉందని, మరిన్ని వివరాల కోసం 040-23450033 లేదా 040-69440069 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. మార్చి 27న జరిగే కల్యాణోత్సవ తలంబ్రాలను ప్రతి ఒక్కరూ పొందేలా సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా నేరుగా ఆర్డర్లు స్వీకరిస్తారని ఆయన స్పష్టం చేశారు.








