వరంగల్‌లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ గతంలో చేసిన వివాదాస్పద 15 నిమిషాల వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అక్బరుద్దీన్ 15 నిమిషాలు కాదు కదా.. 15 ఏళ్ల సమయం ఇచ్చినా ఏమీ చేయలేరంటూ ఎద్దేవా చేశారు. పదేపదే అదే డైలాగులు కొడుతూ కాలక్షేపం చేయడం మానుకోవాలని సూచించారు.
“నీలో నిజంగా దమ్ముంటే నీ సెక్యూరిటీ వదిలేయ్.. నేను కూడా నా సెక్యూరిటీని వదిలేస్తాను. 15 నిమిషాలు కాదు కేవలం ఐదు నిమిషాలు సమయం ఇవ్వు.. ఆ ఐదు నిమిషాల్లో మేమేంటో నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను” అంటూ రాజాసింగ్ అక్బరుద్దీన్ ఒవైసీకి బహిరంగ సవాల్ విసిరారు. డేట్, టైమ్, ప్లేస్ అన్నీ నువ్వే డిసైడ్ చేయ్.. నీ అడ్డాకి రావాలా.. నీ గడ్డాకి రావాలా.. లేక నీ ఇంటికే రావాలా చెప్పు.. ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ వార్నింగ్ ఇచ్చారు.
తనకు కత్తులు, గన్లు ఏవీ వద్దని.. కేవలం తన చేతులతోనే నిన్ను చంపేస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీ గతంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని.. దానికి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందంటూ హెచ్చరించారు. ఓవైసీ సోదరుల రాజకీయాలు పాతబస్తీ దాటి బయటకు రావడం లేదని విమర్శించారు. రాజాసింగ్ మాటలు సభకు వచ్చిన యువతలో తీవ్ర ఉద్వేగాన్ని నింపాయి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.








