హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగిన బాలిక గ్యాంగ్ రేప్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితుల క్రూరత్వానికి సంబంధించి షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. మైనర్ బాలికపై నిందితులు ఏకంగా మూడుసార్లు విడతల వారీగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు ముందుగా బాలికకు బిర్యానీ తీసుకువచ్చారు. అందులో నిద్రమాత్రలు కలిపి బాలికకు తినిపించారు. అది తిన్న కొద్దిసేపటికే బాలిక స్పృహ కోల్పోవడంతో నిందితులు ఒకరి తర్వాత ఒకరు ఆమెపై మొదటిసారి లైంగిక దాడికి పాల్పడ్డారు. నిద్రమాత్రల ప్రభావంతో బాలిక ప్రతిఘటించలేని స్థితిలో ఉండటాన్ని నిందితులు ఆసరాగా చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో నిద్రమాత్రల ప్రభావం తగ్గి బాలిక స్పృహలోకి రాగా నిందితులు ఆమెను మరింత హింసించారు.
బాలిక స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న బాలికపై రెండోసారి సామూహిక అత్యాచారం చేశారు. ఇంతటితో ఆగని నిందితులు తెల్లవారుజామున మరోసారి రెచ్చిపోయారు. ఈసారి కత్తి చూపించి ప్రాణాలతో చంపేస్తామని బాలికను బెదిరించారు. భయాందోళనకు గురైన బాలికపై మూడోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోక్సో (POCSO) చట్టంతో పాటు ఇతర కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ప్రస్తుతం ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో మహిళలు బాలికల రక్షణపై ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. నిందితులకు కఠిన శిక్ష పడేలా వేగంగా విచారణ పూర్తి చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.








