AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అది యూరియా యాప్ కాదు.. రైతులకు ఉరితాడు, రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు విమర్శలు..

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ట్వీట్ చేశారు. యూరియా పంపిణీ కోసం ప్రవేశపెట్టిన నూతన యాప్ విధానం రైతులకు శాపంగా మారిందని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షాపుల్లో సులభంగా దొరకాల్సిన యూరియాను యాప్‌ల ద్వారా ఇస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటం రైతుల పాలిట శాపమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

యాదాద్రి భువనగిరి జిల్లాలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని హరీష్ రావు విమర్శించారు. గతంలో యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టిన దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తీసుకువచ్చిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చెబుతున్న మార్పు అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఎండలో గంటల తరబడి నిలబడి రైతులు పడుతున్న ఆక్రందనలు ప్రభుత్వానికి వినిపించడం లేదా అని నిలదీశారు.

 

రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు నిరక్షరాస్యులని.. వారందరికీ స్మార్ట్ ఫోన్లు వాడటం తెలియదన్న కనీస జ్ఞానం ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటని హరీష్ రావు దుయ్యబట్టారు. సాంకేతికత పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం కర్కశత్వమేనని పేర్కొన్నారు. అన్నం పెట్టే రైతన్న పట్ల ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ సమాజం మొత్తం ఈ పరిణామాలను గమనిస్తోందని హరీష్ రావు ఫైర్ అయ్యారు.

 

యూరియా పంపిణీకి తెచ్చిన కొత్త యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే ఎటువంటి షరతులు లేకుండా రైతులకు ఎరువులు సరఫరా చేయాలని కోరారు. రైతుల సహనాన్ని పరీక్షించవద్దని.. ఇబ్బందులు ఇలాగే కొనసాగితే రైతులు ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తారని హెచ్చరించారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని.. రైతులకు అండగా బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.

ANN TOP 10