మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జరిగింది. ఈ విచారణకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సహా మిగిలిన నిందితులు స్వయంగా హాజరయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన కీలక ఆధారాలను నిందితులకు అందజేయాలని గతంలోనే కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబిఐ అధికారులు సుమారు 13 లక్షల ఫైళ్లతో కూడిన హార్డ్ డిస్క్‌లను నిందితులందరికీ అందజేశారు. ఈ డిజిటల్ ఫైళ్లలో కేసు దర్యాప్తుకు సంబంధించిన అనేక కీలక పత్రాలు డిజిటల్ సాక్ష్యాలు ఉన్నాయి.
సిబిఐ అందించిన హార్డ్ డిస్క్‌లను పరిశీలించిన నిందితుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకువచ్చారు. హార్డ్ డిస్క్‌ల్లో ఉన్న కొన్ని ఫైళ్లు ఓపెన్ కావడం లేదని వారు తెలిపారు. ఇందులో తీవ్రమైన సాంకేతిక సమస్యలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. లక్షలాది ఫైళ్లు ఉన్నందున వాటిని విడివిడిగా పరిశీలించడం తమకు కష్టతరంగా మారుతోందని పేర్కొన్నారు. సరైన క్రమపద్ధతిలో ఫైళ్లు లేకపోతే డిఫెన్స్ సిద్ధం చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుందని వారు వాదించారు.
ఈ భారీ సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఇండెక్స్ రూపంలో డేటాను అందించాలని న్యాయవాదులు కోరారు. ఏ ఫైల్‌లో ఏ సమాచారం ఉందో స్పష్టంగా తెలిస్తేనే విచారణ ప్రక్రియ వేగంగా జరుగుతుందని విన్నవించారు. 13 లక్షల ఫైళ్లలో కావాల్సిన సమాచారాన్ని వెతుక్కోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు. నిందితుల తరపు న్యాయవాదుల విజ్ఞప్తిని విన్న న్యాయస్థానం ఈ అంశంపై తదుపరి చర్యలకు ఆదేశించింది.
సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు నిందితుల తరపు న్యాయవాదులు కోరిన విధంగా ఇండెక్స్ సాధ్యమేనా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంది. అనంతరం కోర్టు ఈ కేసు తదుపరి విచారణను మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. అప్పటికల్లా సాంకేతిక లోపాలను సరిదిద్దాలని డిజిటల్ డేటా విషయంలో స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నారు. వివేకా హత్య కేసులో సిబిఐ సమర్పించిన ఈ భారీ డిజిటల్ డేటా ఇప్పుడు విచారణలో అత్యంత కీలకంగా మారింది.








